రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ గవర్నర్ శుభవార్త చెప్పారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐ చెల్లించకపోయిన పర్వాలేదని తెలిపారు. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థలు అన్ని రకాల లోన్‌లపై ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని శక్తికాంతదాస్ సూచించారు. హౌసింగ్‌లోన్లతో పాటు అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెల్లించాల్సిన ఈఎంఐలు తర్వాత పీరియడ్ లో ఎప్పుడైనా చెల్లించవచ్చన్నారు. అటు ఈఎంఐకట్టకపోయిన సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు.
కరోనా ప్రభావంతో భారత రిజర్వ్ బ్యాంక్( RBI) కీలక ప్రకటన చేసింది. రివర్స్ రెపో రేటు 90 బేసిస్ పాయింట్లు, రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపోరేటు 4.4 శాతానికి తగ్గిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన ఆయన… అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని తెలిపారు. అటు సరైన సమయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరిద్దామన్నారు శక్తికాంతదాస్. మార్కెట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు.