కరోనా కల్లోలం వేళ కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యవహరిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేటింగ్ లో కోసం ప్రయత్నిస్తారా, సమాజహితం అక్కర్లేదా… ఆ మాత్రం బాధ్యత అక్కర్లేదా అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… 2 రోజుల క్రితం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద జరిగిన ఘటన లపై కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మంత్రి మండిపడ్డారు. అసలు క్వారంటైన్ చేయకుండా రాష్ట్రంలోకి ఎలా అనుమతిస్తామని ఆయన ప్రశ్నించారు. నిరాశ్రయులందరికి కల్యాణ మండపాల్లో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు, ఎవరైనా భోజనాలకు ఇబ్బంది పడితే గ్రామ వలంటీర్ల ద్వారా అందిస్తామని మంత్రి తెలిపారు. ఇకనైనా కరోనా విపత్తు నేపథ్యంలో ఎల్లో మీడియా ఛానళ్లు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడడం మాని, బాధ్యతాయుతమైన మీడియా గా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పేర్ని నాని హితవు పలికారు.