వైరస్ ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మేము ధైర్యం కోల్పోలేదు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
డాక్టర్లు, ఇతర ఇబ్బందితో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నాం. ఐసోలేషన్ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందించగలం. 1400 ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచాం. 500 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చాం..అవి వస్తున్నాయి. 12400 ఇన్‌పేషంట్స్‌కు సేవలందించేందుకు బెడ్స్ సిద్ధం.
గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 60వేల మంది వ్యాధికి గురైనా చికిత్స అందించే ఏర్పాట్లు చేశాం. 11వేల మంది విశ్రాంత వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు వాడుకునేలా చర్యలు తీసుకున్నాం. పోలీసులు, ప్రభుత్వ, వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలి. ప్రజల అలసత్వం సరికాదు, బాధలైనా భరించాలి. ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నాం.
ఎక్కడివాళ్లు..అక్కడే ఉండండి. రాష్ట్రంలో ఉన్నవాళ్లందరికి ఆహార వసతి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం అండగా ఉంటుంది..అందరి కడుపులు నింపుతాం. తెలంగాణలో ఉన్న వారందరి ఆకలి తీర్చుతాం. అన్నదాతలను ఆదుకుంటాం. 15 రోజులు 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తాం. ఎస్సారెస్పీ, సాగర్, జురాల ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. హాస్టల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయబడవు. ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులకు ఆందోళన అవసరం లేదు. వ్యవసాయ, డైరీ, పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. హాస్టల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయబడవు. అని సీఎం కేసీఆర్ వివరించారు
