వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. వారి ద్వారా ప్రజలకు సేవలు అందుతాయి.. అయితే ఎవరినైనా గుర్తించాలన్నా, వేగంగా పధకాలు ఇవ్వాలన్నా కొంత సమయం పడుతుంది.
అయితే దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో ప్రతీ 50ఇళ్లకు వలంటీర్‌ను నియమించడం వల్ల అన్ని విధాలా లాభం ఉందని కరోనా కట్టడి విషయంలో స్పష్టమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిని వేగంగా గుర్తించి, 89 శాతం మందికి పరీక్షలు చేయించడం మామూలు విషయం కాదు. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి ఒక్కో వలంటీర్ సైనికుడిలా ముందుకు కదులుతున్నాడు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన 3 పాజిటివ్ కేసుల్లో ఇటలీ నుంచి, లండన్ నుంచి, మరొకరు సౌదీ నుంచి వచ్చిన వ్యక్తులే. కరోనా లక్షణాలు కనిపించిన వారు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే.. వీరిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడంలో వలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగపడింది. ఇదే విషయాన్ని సీఎం జగన్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. వైరస్‌ను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా జగన్ వివరించగా ప్రధానమంత్రి అభినందించారు.