కోవిడ్ – 19 వైరస్ నిర్మూలనకు సంబంధించిన పటిష్ట భద్రతా చర్యలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సూచనల మేరకు ఏపి భవన్ లో ఉద్యోగుల సంక్షేమార్థం రెసిడెంట్ కమిషనర్ శ్రీమతి భావన సక్సేనా ఈరోజు సోమవారం నుండి మార్చ్ 31వ తేదీ వరకు తగిన ఆదేశాలను జారీచేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ భవన్ లోని కార్యాలయాలైన పే & అకౌంట్స్, అకౌంట్స్ విభాగం, ఎస్టాబ్లిష్మెంట్, లీగల్ సెల్, రోడ్స్ & బిల్డింగ్స్, లైసిన్ వింగ్, టూరిజం కార్యాలయాలను మార్చ్ 31వ తేదీవరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు, ఇందులోని ఉద్యోగులు తమ తమ ఇండ్లనుంచే కార్యాలయానికి సంభందించిన కార్యక్రమాలను చేయవలసి ఉంటుందని తెలిపారు. వీరందరూ ఫోన్లలో, వాట్సాప్, ఈ మైల్స్ ద్వారా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎపి భవన్ కు దూరంగా వున్న 60 ఏళ్ళు వయస్సు పైబడిన కాంట్రాక్టు ఉద్యోగులందరూ కూడా వారి ఇళ్లనుంచి పనిచేయాలని చెప్పారు. ఎపి భవన్ లోని అత్యవసర విభాగాలైన రిసెప్షన్, కోవిద్ – 19 కంట్రోల్ రూమ్, రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలు అవసరమైనమేర సిబ్బందితో రొటేషన్ పద్దతిలో పనిచేయవలసివుంటుందని ఆదేశించారు. భవన్ లోని అతిధుల గృహాలను, లిఫ్టులను, భవన్ పరిసర ప్రాంతాలను, ఉద్యోగులు నివాసముంటున్న భవన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రత్యేకంగా నియమించిన పారిశుభ్ర కార్మికులతో శుభ్రం చేయించవలసినదిగా భవన్ హౌస్ కీపింగ్ అధికారులను ఆదేశించారు. భవన్ లో నివాసముంటున్న డ్రైవర్లను అవసరమైనప్పుడు తక్షణమే విధులకు హాజరగునట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రోటోకాల్ విభాగ అసిస్టెంట్ కమీషనర్ ను ఆదేశించారు. భవన్ లో శానిటైజర్స్, మాస్కులు, సబ్బులు అవసరమైనంతమేర అందరికి అందుబాటులో వుంచవలసినదిగా ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదేశించారు. భవన్ లోని కాంటీన్ కార్మికులు ప్రస్తుతం ఎవరైతే వున్నారో వారందరికీ తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కమిషనర్ ఆదేశించారు.
