ప్రపంచదేశాలకు కరోనా ఓ శాపంలా మారింది. అనేక దేశాల్లో జనం ఆ వైరస్‌తో వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర లక్షల మందికి ఆ వ్యాధి సోకింది. కోవిడ్19తో సుమారు 14 వేల మంది మరణించారు. మన దేశం కూడా ఈ మహమ్మారిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నది. దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. కరోనాపై మీడియా సమావేశం నిర్వహించిన డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆయన అన్నారు. గతంలో రెండు సార్లు ఇలాంటి మహా విపత్కర పరిస్థితుల నుంచి భారత్ బయటపడినట్లు ఆయన తెలిపారు. మశూచీ లేదా అమ్మవారు, పోలియో సోకిన సమయంలో భారత్ చూపించిన తెగువను ఆయన మెచ్చుకున్నారు. వైరస్ గురించి పరీక్షించేందుకు చాలా వరకు పరిశోధనశాలలు అవసరమని అన్నారు. భారత్‌లో జనాభా ఎక్కువ అని, ఇంత జన సాంద్రత కలిగిన దేశంలోనే వైరస్‌కు భవిష్యత్తు ఉంటుందని, గతంలో భారత్ ఇలాంటి రెండు మహోపద్రవాలను ఎదర్కొన్నదని, తట్టు, పోలియో నివారణలో భారత్ విజయం సాధించిందని, ఇప్పుడు కూడా కరోనాను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని ర్యాన్ తెలిపారు.
ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు సులభతరమైన ఉపాయాలు ఏవీ లేవని, ఇండియా లాంటి దేశాలే ఓ మార్గాన్ని చూపాలని, వాళ్లకు గత అనుభవం ఉన్న దృష్ట్యా.. ఇది ఆయా దేశాలకు సాధ్యమే అని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ పరిశుభ్రత పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.