కరోనా ప్రభావంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన తరుణంలో రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీనిపై సమీక్షించిన సీఎం జగన్ బడ్జెట్‌పై ఆర్జినెన్స్ జారీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఉంది. దీనిలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలందరూ ఆ రోజున శాసనసభకు రావాలి. ఒకవేళ రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా తాత్కాలికంగా నిలిపివేయవచ్చన్న అంశంపైనా సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనూ నిలిపివేసే ప్రకటన జారీ చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ యథావిధిగా జరిగితే 27 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
