తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అధికారులు నడుంబిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో 14 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. మరో నాలుగుచోట్ల తాత్కాలిక చెక్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి చెక్‌పోస్టు దగ్గర రవాణాశాఖ నుంచి ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న వాహనాలను చెక్‌పోస్టుల్లో తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చినవారుంటే హోంక్వారంటైన్ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి సమీపంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో శుక్రవారం చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. ప్రాణహితపై వంతెన నిర్మాణం పూర్తవడంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలు పెరిగాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నుంచి కోటపల్లి మండలం మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచకు బస్సులు రాకపోకలను నిలిపివేశారు. తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడెబల్లూరు, చేగుంట వద్ద శుక్రవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు రాష్ర్టాల నుంచి వస్తున్నవారికి స్క్రీనింగ్ నిర్వహించారు.
తీర్థయాత్రకు వెళ్లొచ్చినవారికి స్క్రీనింగ్
జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి చెందిన 31 మంది ఇటీవల వారణాసి, మహారాష్ట్ర ప్రాంతాల్లో తీర్థయాత్రలకు వెళ్లి శుక్రవారం గ్రామానికి వచ్చారు. రెవెన్యూ, పోలీసులు అధికారులు వారిని నేరుగా గద్వాల దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు లేకపోవడంతో పదిరోజులు ఇంటిదగ్గరే ఉండాలని సూచించారు.
సింగరేణి కార్మికుడు హౌజ్ క్వారంటైన్
రామగుండం డివిజన్‌లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న ఓ కార్మికుడు నాలుగు రోజుల కిందట సంపర్క్‌క్రాంతి రైలులో ఇండోనేషియాకు చెందినవారితో కలిసి ప్రయాణించాడు. గురువారం రాత్రి సింగరేణి ఏరియా దవాఖానకు రాగా, హుటాహుటిన హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వైరస్ లక్షణాలు లేవని పేర్కొన్నప్పటికీ, మరో పదిరోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రావొద్దని సూచించారు. దీంతో అధికారులు ప్రత్యేక వాహనంతో అతడిని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టారు. ముందుజాగ్రత్తగా వైద్యబృందాలతో కార్మిక కుటుంబాలకు వైద్యపరీక్షలు చేశారు.
మహారాష్ట్ర నుంచి వచ్చినవారిలో లక్షణాలు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన గ్రామీణ వైద్యుడు ఇటీవల మహారాష్ట్రకు వెళ్లివచ్చారు. జలుబు, దగ్గుతో నీరసంగా ఉండటంతో ఆరోగ్యసిబ్బంది శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ వ్యాపారి తన తమ్ముడితో కలిసి మహారాష్ట్ర, పుణెకు వెళ్లి రెండురోజుల కిందట తిరిగొచ్చారు. జలుబు, దగ్గు రావడంతో జిల్లా కేంద్ర దవాఖానలోని ఐసొలేషన్ వార్డులో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలోని శానిటరీ కంపెనీ బ్రాంచి దుబాయిలో కూడా ఉన్నది. మండలం నుంచి 35 మంది దుబాయ్‌లో పనిచేసేందుకు వెళ్లి ఇటీవల తిరిగొచ్చారు. వీరిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలియడంతో వైద్యబృందం వెళ్లి పరీక్షలు చేయగా వైరస్ లక్షణాలు లేవని తేలింది.
Tags carona carona effect carona virus kcr ktr slider telangana governament telanganacm telanganacmo trs governament trswp