ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి, పనితీరుపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి రాజ్యసభ సభ్యులు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఎంపిక అయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. లోక్ సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులు మొత్తం 22 మంది కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు.
ప్రాధాన్యతా ఓటు ఆధారంగా రెండు సభలకు చెందిన ఎంపీలు ఈ కమిటీలో సభ్యులను ఎన్నుకుంటారు. కమిటీకి చైర్మన్ ను లోక్ సభ స్పీకర్ నిర్ణయిస్తారు. దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయటం, వాటి ఖాతాలను పరిశీలించటంతో పాటు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇచ్చే నివేదికలను కూడా పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ అధ్యయనం చేస్తుంది.
అలాగే ఈ ప్రభుత్వ రంగ సంస్థల వార్షిక నివేదికలు ప్రతీ యేటా పార్లమెంట్ ముందు ఉంచేలా కూడా కమిటీ పర్యవేక్షిస్తుంది.అత్యంత ప్రాధాన్యత కలిగిన పార్లమెంటరీ కమిటీకి తాను ఎంపిక కావటంపై ఎం.పీ సంతోష్ కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా తన బాధ్యత మరింత పెరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా తమ కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వెల్లడించారు.
Tags joginapalli santosh kumar kcr ktr mp rajyasabha telangana telangana governament trs governament trswp