గత 9 నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కుట్రలపై అధికార పార్టీ విసుగెత్తిపోయింది. తొలుత చంద్రబాబు, ఎల్లోమీడియాతో కలిసి ఎంతగా దుష్ప్రచారం చేయిస్తున్నా సీఎం జగన్ పాలనపై దృష్టి పెడుతూ సంక్షేమ కార్యక్రమాలును అమలు చేస్తూ ముందుకుసాగారు. కాని రాజధాని పేరుతో గత 3 నెలలుగా తన సామాజికవర్గానికి చెందిన రైతులతో ఆందోళనలు చేయించడం, శాసనమండలిలో స్పీకర్ షరీష్‌ను అడ్డంపెట్టుకుని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం , ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరితో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం..ఇలా చంద్రబాబు చేస్తున్న వరుస కుట్రలతో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. అందుకే చంద్రబాబును ఉపేక్షిస్తే..ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూడా వెనుకాడడని గ్రహించిన సీఎం జగన్ టీడీపీని నిర్వీర్యం చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పటివరకు టీడీపీ నుంచి వలసలకు అంగీకరించని జగన్..ఇప్పుడు ఆ పార్టీ నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆ పార్టీ నుంచి వస్తున్న మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం తాను గతంలో చెప్పినట్లు విధంగా పార్టీలో చేర్చుకోకుండా బయట నుంచి మద్దతు ఇవ్వమని చెబుతున్నారు.
అలాగే రాజధాని గ్రామాలలో తన సామాజికవర్గానికి చెందిన రైతులతో అమరావతి ఆందోళనలను నడిపిస్తూ ప్రభుత్వాన్ని మూడు రాజధానులపై ముందడుగు వేయకుండా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు అదే అమరావతిలో గట్టి షాక్ ఇవ్వాలని సీఎం జగన్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే అమరావతిలో గత చంద్రబాబు హయాంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దల పాత్రపై సీఐడీ, ఈడీలతో విచారణ చేయిస్తున్న జగన్ సర్కార్..ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయాలను టార్గెట్ చేస్తోంది.ఈ మేరకు నిబంధనల ఉల్లంఘన పేరుతో మంగళగిరిలోని ఆత్మకూరు టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపిన పురపాలక శాఖ త్వరలో వీటిపై చర్యలకు ఉపక్రమించబోతోంది. ఇప్పుడు గుంటూరులోని టీడీపీ నగర కార్యాలయం లీజు విషయంలో అక్రమాలను బయటపెట్టబోతోంది. 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించాక అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో తమ పార్టీ కార్యాలయాల కోసం భూములను కేటాయించింది.
ఇందులో భాగంగా మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై నిర్మించిన టీడీపీ కేంద్ర కార్యాలయానికి మూడున్నర ఎకరాలు కేటాయించింది. అయితే ఈ భూముల కేటాయింపు నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయని జగన్ సర్కార్ గుర్తించింది. అంతేకాదు ప్రభుత్వం నుంచి పొందిన మూడున్నర ఎకరాలతో పాటు పక్కనే ఉన్న ప్రైవేటు భూములను సైతం ఆక్రమించుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సదరు ప్రైవేటు భూ యజమాని టీడీపీపై కేసులు కూడా పెట్టారు. ఈ కేసులను ఆసరాగా చేసుకుని నిబంధనలకు అతిక్రమించి ప్రైవేటు భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనిపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మిగతా అక్రమాలను కూడా వెలికి తీసి టీడీపీ కార్యాలయాల కూల్చివేతకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మొత్తంగా అమరావతిలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ కార్యాలయాలను కూల్చివేసి, ఆయా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని చంద్రబాబుకు గట్టి షాక్ ఇవ్వాలని వైసీపీ సర్కార్ భావిస్తుందని సమాచారం. మరి ఈ విషయంలో వైసీపీ స్కెచ్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.