ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో విజయవాడ దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమి నాయుడు పేర్కొన్నారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను సైతం రద్దు చేశామన్నారు. అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు వెల్లడించారు. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, లిఫ్టులను నిలిపి వేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అందజేస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ వైద్యపరీక్షలు చేస్తున్నామన్నారు. అంతేకాక దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపిస్తున్నామన్నారు. ఉగాది రోజు పంచాగశ్రవణం ఉంటుందని, కానీ అమ్మవారి సేవలకు భక్తులకు అనుమతి లేదన్నారు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. భక్తులు ఎవరైనా ముందుగా సేవలను బుక్ చేసుకుని ఉంటే వారిపేరున సేవలు నిర్వహిస్తామన్నారు. లేదు, డబ్బు తిరిగి కావాలనుకుంటే చెల్లిస్తామన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసరాలను శుభ్రపరుస్తున్నామని, మహామండపం నుంచి మెట్లమార్గం ద్వారా ఘాట్ రోడ్డు మార్గాల్లోనే భక్తుల అనుమతినిచ్చామన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు దర్శనానికి రాకపోవడమే మంచిదని సూచించారు. పొంగలి, కదబం, దద్దోజనం వంటి ప్రసాదాలు ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నామని తెలిపారు.
