ఏపీలో కలకలం రేపుతున్న ఫేక్ లెటర్ ఉదంతంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. సీఎం జగన్‌ది ఫ్యాక్షన్ నేపథ్యం అని, అధికార వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఇలా పలు వివాదాస్పద అంశాలతో కేంద్ర హోం శాఖకు ఈసీ లేఖ రాశాడంటూ ఎల్లోమీడియా ప్రచారం చేసింది. జగన్ సర్కార్‌ను బద్నాం చేసే విధంగా ఉన్న ఆ లేఖపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారి ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలయ్యేలా లేఖ ఎలా రాయగలుగుతారు…ఇది కచ్చితంగా ఈసీ నిమ్మగడ్డతో కుమ్మక్కై చంద్రబాబు రాయించిన లేఖ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే ఆ లెటర్ రాయలేదని నిమ్మగడ్డ స్పష్టం చేసినప్పటికీ ఆయన లెటర్ హెడ్‌పై వచ్చిన ఆ 5 పేజీల లేఖపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ చౌదరి కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జోగి రమేష్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కైలే అనిల్‌కుమార్ తదితరులు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఓ వినతిపత్రాన్ని అందజేశారు. ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో పనిచేస్తోన్న ఓ అత్యున్నత స్థాయి అధికారి పేరు మీద ఆ నకిలీ లేఖను ఎవరు సృష్టించారు?..దాని వెనుక ఎవరు ఉన్నారు? దాన్ని ఎల్లోమీడియాలో ప్రసారం చేయించింది ఎవరో తేల్చాలని వైసీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను డిమాండ్ చేశారు. అంతే కాదు తమ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా ప్రచారమైన ఆ ఫేక్ లేఖ వెనుక టీడీపీ హస్తం ఉందని, చంద్రబాబు కుట్రపూరితంగా ఈ లేఖను సృష్టించారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
తన పేరు మీద ఓ నకిలీ లెటర్ ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రసారం అవుతుంటే వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి..తాను ఆ లెటర్ రాయలేదని నిమ్మగడ్డ ఎందుకు ఖండించలేదు…పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నకలీ లేఖ వ్యవహారంలో తన సామాజికవర్గానికి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇరుక్కుపోతాడనే ఉద్దేశంతోనే ఈసీ నిమ్మగడ్డ పోలీసులకు కంప్లైంట్ చేయలేదని తెలుస్తోంది. తక్షణమే డీజీపీ ఈ కేసుపై కూలంకుశంగా విచారణ జరిపిస్తే ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న చంద్రబాబు, ఈసీ నిమ్మగడ్డల కుట్ర బయటపడుతుందని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ ఫేక్ లెటర్ వ్యవహారంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి మెడకు ఉచ్చు బిగుసుకునేలా ఉంది.