ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 180 కుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదెంది. దీంతో జగన్ సర్కార్ కూడా అప్రమత్తమైంది. కరోనావైరస్(కోవిడ్-19)నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు, ఇండోర్ అమ్యూజ్‌మెంట్ పార్కులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పెద్ద దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూ దర్శనాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది.
కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసున్నారు. అలాగే వైద్యం పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులైన వైద్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి కానీ..భయన్ని కాదని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో గుమిగూడే జాతరలు మానుకుంటే మంచిదని, శుభకార్యాలు వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలని కోరారు. ప్రజారవాణాలో ఉన్న వాహనాలు శుభ్రతను పాటించాలన్నారు. ఎక్కువ మందిని బస్సులో ఎక్కించుకోవద్దని సూచించారు. మార్చి 31 వరకు ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి నిరోధక చర్యలతో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సినిమా హాల్స్, మాల్స్, టెంపుల్స్, చర్చిలు, మసీదులను ఈ నెల 31వరకు మూసేస్తున్నాం అని వెల్లడించారు. భక్తులు జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ మంది రద్దీ లేకుండా చూసుకోవాలని సూచించారు. వీలైతే పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని కోరారు. తప్పనిసరి అయితే తక్కువ మందితో ఫంక్షన్లు జరుపుకోవాలన్నారు. మొత్తంగా కరోనా వైరస్ నియంత్రణకు జగన్ సర్కార్ నడుం బిగించింది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా నడుచుకుంటూ…అధికారులకు సహకరిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్తత్తలు తీసుకుంటూ తమను తాము కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ మీద ఉంది.