ఏపీ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ఈసీ నిమ్మగడ్డ రమేష్ లెటర్ హెడ్‌పై వచ్చిన 5 పేజీల లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అయింది. ఆ లేఖలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. సీఎం జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వైసీపీ నేతల బెదిరింపులతో తనకు , తన కుటుంబానికి ప్రాణభయం ఉందంటూ కేంద్ర హోంశాఖకు ఈసీ నిమ్మగడ్డ రాసినట్లు ఆ లేఖలో ఉంది. అయితే అత్యంత రహస్యంగా ఉండాల్సిన లేఖ ఎల్లోమీడియాకు ఎలా చేరిందనే విషయంపై ప్రభుత్వం ఈసీని నిలదీసింది.అంతే కాదు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ఆ లేఖలో పేర్కొన్న పలు విషయాలపై నిమ్మగడ్డను ప్రభుత్వం ప్రశ్నించింది. దీంతో తాను ఆ లేఖ రాయలేదని నిమ్మగడ్డ వివరణ ఇచ్చినా…మరి తన లెటర్ హెడ్‌పై వచ్చిన ఆ లేఖ ఎల్లోమీడియాకు ఎలా చేరిందనే విషయాన్ని మాత్రం దాటవేస్తున్నారు. ఈసీ నిమ్మగడ్డ తీరుపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో ఎల్లోమీడియాలో వచ్చిన ఫేక్ లేఖపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ఈసీ నిమ్మగడ్డపై నిప్పులు చెరిగారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. వ్యక్తులకు కొమ్ము కాస్తూ రాజ్యాంగబద్ధమైన పదవికి ఆయన కళంకం తెస్తున్నారని ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ పేరుతో విడుదలైన లేఖలోని సారాంశం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందన్నారు. ఎన్నికల కమిషనర్ పేరుతో ఆ లేఖను పచ్చ మీడియాలో పదేపదే చూపించారని.. ఆ లేఖను ఖండించకపోవటంలో నిమ్మగడ్డ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈసీ మౌనం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆ లేఖ చంద్రబాబు కార్యాలయంలో ప్రిపేర్ చేసినట్లు ఉందని వెల్లంపల్లి ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ రాజకీయ పార్టీ నేతలా వ్యవహరిస్తున్న రమేష్ కుమార్‌ను వెంటనే ఎస్‌ఈసీ నుంచి తప్పించాలని కోరారు. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా ప్రభుత్వంపై నిందలు వేయటం భావ్యం కాదని, రమేష్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. విచక్షణాధికారానికి వక్రభాష్యం చెపుతున్న చంద్రబాబుకు అదే విచక్షణతో జనం బుద్ధి చెబుతారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా విమర్శలు చేశారు. మొత్తంగా నిమ్మగడ్డ పేరుతో ఎల్లోమీడియాలో ప్రసారమైన ఫేక్ లేఖ ఉదంతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. మరి ఈ ఫేక్ లెటర్ బాగోతంపై ప్రభుత్వం విచారణ జరిపిస్తున్న తరుణంలో టీడీపీ దోషిగా తేలుతుందో లేదో చూడాలి.