ఏపీలో అధికార వైసీపీ పార్టీలోకి వలసలు ఇప్పట్లో ఆగేలాలేవు. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన సీనియర్ నాయకులంతా పార్టీకి గుడ్‌బై చెప్పేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు డొక్కామాణిక్యవరప్రసాద్ రావు, రామసుబ్బారెడ్డి, గాదె వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, కదిరి బాబురావు, పాలేరు రామారావు, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌లు వైసీపీ కండువా కప్పుకోగా త్వరలో మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, మాజీమంత్రి శిద్ధారాఘవరావు తదితరులు కూడా వైసీపీలో చేరడం ఖాయమైంది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌కు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అయిన డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైయస్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అయితే వైయస్ మరణాంతరం డీఎల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అంతే కాదు కడప లోకసభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన వైయస్ జగన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ జగన్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డీఎల్ పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు డీఎల్ దూరంగా ఉన్నారు.
అయితే ఒకప్పుడు వైయస్ స్నేహితుడిగా కడప జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన డీఎల్ రవీంద్రారెడ్డిని వైసీపీలోకి చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. తన తండ్రితో ఉన్న అనుబంధంతో పాటు, డీఎల్ అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీఎల్ బంధువర్గమంతా వైసీపీలో చేరారు. డీఎల్ వియ్యంకుడు గాదె వెంకటరెడ్డి, అల్లుడు గాదె మధుసూదన్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఇక డీఎల్ చేరిక కూడా లాంఛనప్రాయమే అని కడప జిల్లాలో చర్చ జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో డీఎల్ టీడీపీలోనో, లేదా వైసీపీలోనో చేరుతారని వార్తలు వచ్చాయని కాని అదేమి జరుగలేదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలోకి వలసలు షురూ అవుతున్న టైమ్‌లో డీఎల్ కూడా తన చేరికకకు ఇదే మంచి సమయమని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా మరి కొద్ది రోజుల్లోనే డీఎల్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఖాయమని కడప జిల్లాలో చర్చ జరుగుతోంది. మొత్తంగా వైసీపీలోకి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేరిక వార్తలు కడప జిల్లా రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.