స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించామని ఆనందంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. ప్రకాశం, కడప జిల్లాలతో మొదలైన వలసల పర్వం ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీని కుదిపేస్తోంది. కర్నూలు జిల్లాలో బలమైన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మరో టీడీపీ సీనియర్ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి పార్టీకీ రాజీనామా చేయాలని నిర్ణయించారు. త్వరలో ఆయన వైసీపీలో చేరవచ్చని తెలుస్తోంది. బీసీ జనార్థన్ రెడ్డి దశాబ్దాలుగా టీడీపీలో కీలకనేతగా పని చేస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో బనగానపల్లె నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019లో మాత్రం జగన్ హవాలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు అమరావతికి జై కొట్టి కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటును వ్యతిరేకించడంతో బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కర్నూలు జిల్లా ప్రజల దశాబ్దాల కోరిక అయిన హైకోర్టు ఏర్పాటు విషయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు, అమరావతి గ్రామాల రైతులు కించపర్చేలా వ్యాఖ్యలు చేయడంతో జనార్థన్ రెడ్డి మనోవేదన చెందుతున్నారు. పదేపదే రాయలసీమ గూండాలంటూ సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే దశాబ్దాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో నాయకత్వలేమితో సతమతమవుతున్న టీడీపీ జనార్థన్ రెడ్డి రాజీనామాతో పూర్తిగా ఖతమ్ కానుంది. మొత్తంగా తనకు అత్యంత సన్నిహితుడైన బీసీ జనార్థన్ రెడ్డి కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరడం చంద్రబాబుకు మరింత షాకింగ్ మారింది.