ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్‌లోనూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి.. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని కొరకు అందుబాటులో ఉన్న ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను వైద్యులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందకు తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ట్విటర్ వేదికగా తెలిపారు. ’దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా పెరుగుతోంది. కోవిడ్ బాధితులకు వైద్య సదుపాయం కల్పించేందుకు తమకు చెందిన సంగారెడ్డిలోని 300 పడకల గదులు, విశాఖపట్నంలో 100 పడగల గదులు గల చారిటీ సిటిస్ అసరమైతే ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు. వీటికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు’అని ప్రకటించారు.