తెలుగు రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు బాగోతం అనగానే టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుకువస్తారు. మావాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో స్వయంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అప్పుడప్పుడే విభజనతో తెలుగు ప్రజల మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉన్న తరుణంలో చంద్రబాబు తెలివిగా సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంటూ బుకాయించి ఆ కేసు నుంచి అప్పటికీ తప్పించుకున్నాడు. కానీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు మెడపై ఓటుకునోటు కత్తి వేలాడుతూనే ఉంది. తాజాగా కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఓటుకు నోటు బాగోతానికి పాల్పడినట్లు టీడీపీలో దశాబ్దాలుగా పని చేసి, ఇటీవల వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై జరుగుతున్న వివాదంపై పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఒత్తిడికి గురై ఉద్దేశపూర్వకంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం దారుణమని రామసుబ్బారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న కాలానికి జరిగితే రాష్ట్రానికి రావలసిన రూ. 5 వేల కోట్ల నిధులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడుతున్న టీడీపీ నాయకులు.. నాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు. అందుకే విలువలులేని తెలుగుదేశం పార్టీని వీడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని వెల్లడించారు. అలాగే టీడీపీ మీద నమ్మకం లేకనే మంచి నాయకులంతా పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పారు. సీఎం జగన్ మీద బురద చల్లాలని చూస్తే దేవుడే వారికి బుద్ధి చెబుతాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో చంద్రబాబు, లోకేష్‌లు చేసిన ఓటుకు నోటు బాగోతాన్ని బయటపెట్టారు.గతంతో చంద్రబాబు కుమారుడు లోకేష్.. గతంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించడానికి అందరినీ డబ్బుతో కొనమని చెప్పాడని, వైఎస్సార్ సీపీకి అత్యధిక మెజారిటీ ఉన్నా కోట్లాది రూపాయలు కుమ్మరించి ఆయనను ఓడించారంటూ రామసుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా 2017లో కడపలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో జగన్ బాబాయి దివంగత వైయస్ వివేకానందరెడ్డి ఓడిపోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఆ ఎన్నికల్లో వైయస్ వివేకాపై బిటెక్ రవి గెలుపొందారు. అప్పట్లో చంద్రబాబు, లోకేష్‌లు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను రంగంలోకి దింపి కోట్లాది రూపాయలు కుమ్మరించి వైయస్ వివేకాను ఓడించారంటూ చర్చ జరిగింది. అ సమయంలో రామసుబ్బారెడ్డి సైతం జిల్లాలో టీడీపీ అగ్రనేతగా ఉన్నారు. అందుకే వైయస్ వివేకాను ఓడించడానికి చంద్రబాబు, లోకేష్‌లు మరోసారి ఓటుకు నోటు బాగోతానికి పాల్పడ్డారంటూ రామసుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తంగా కడపలో మరో ఓటుకు నోటు బాగోతంలో చంద్రబాబు, లోకేష్‌ల పాత్ర ఉందంటూ రామసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.