టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను, ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీవీ సస్పెషన్‌పై చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా గగ్గోలు పెట్టింది. అధికారులపై కక్షగట్టి వేధిస్తున్నారంటూ చంద్రబాబు సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు కాగా గత ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, భయపెట్టి, బెదిరించి టీడీపీలోకి లాక్కోవడంలో చంద్రబాబుకు ఏబీవీ కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
అంతే కాదు 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు పన్నిన పన్నాగంలో భాగంగా 2017లో ఇంటిలిజెన్స్ తరపున ఫోన్ ట్యాపింగ్ పరికరాలను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయించిన ఏబీవీ దేశ రక్షణ రహస్యాలను కూడా విదేశాలకు చేరవేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది. పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను సైతం ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏబీవీ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించారు.
అయితే తాజాగా ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇదే వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్నిసమర్థించింది. ఇప్పుడు క్యాట్ కూడా సమర్థించడంతో ఈ కేసులో ఏబీవీ పూర్తిగా కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఏబీవీ సస్పెన్షన్ పిటీషన్‌ను క్యాట్ కొట్టేయడంతో ఈ కేసులో ఏబీవీతో పాటు చంద్రబాబు కూడా దోషిగా తేలే అవకాశం ఉందని ఏపీ ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.