స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరారు. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. 1991లో గాదె వెంకటరెడ్డి పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే 2004 ఎన్నికల సమయంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్ గాదెను గుంటూరు జిల్లాలోని బాపట్ల నుంచి పోటీ చేయించారు. అక్కడ ఆయన 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. వైఎస్ చనిపోయాక కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గాదె వెంకటరెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించి విఫలం చెందారు. ఆ తర్వాత 2016లో గాదె వెంకటరెడ్డి చంద్రబాబు నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకుని తన కొడుకుతో సహా టీడీపీలో చేరారు.
అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ‌్యంలో ప్రకాశం జిల్లా టీడీపీనేతలంతా వైసీపీలో చేరుతుండడంతో గాదె కూడా ఫ్యామిలీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గాదె ఫ్యామిలీ చేరికలో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర వహించారు. ఈ సందర్భంగా గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ..మాజీ సీఎం చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీలో తనకు గౌరవం దక్కలేదని, బాగా అవమాన పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల విశ్వాసాన్నిచంద్రబాబు కోల్పోయారని, అందుకే వైయస్ జగన్ నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకుని వైసీపీలో చేరినట్లు గాదె వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరిబాబురావు, చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేరు రామారావు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దగ్గరి బంధువులు శిద్దా హనుమంతరావు, శిద్దా సూర్యప్రకాశ్‌రావు తదితరులు వైసీపీలో చేరారు. ఇప్పుడు గాదె ఆయన కుమారుడు మధుసూదన్ కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. త్వరలో మరోమాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుసగా కొనసాగుతున్న వలసలు చూస్తుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.