ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదావేయడంపై అధికార వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీని కాపాడుకోవడం కోసం ఇలా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదావేయడం సరికాదని సీరియస్ అయ్యారు. అంతే కాదు నిమ్మగడ్డ తీరుపై సీఎం జగన్ ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కేవలం చంద్రబాబు తన సామాజికవర్గానికే చెందిన నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను ఇలా కుట్రపూరితంగా వాయిదా వేయించాడని..రాష్ట్రానికి వచ్చింది కరోనా వైరస్ కాదని,..క్యాస్ట్ వైరస్ అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే తాజాగా చంద్రబాబు, నిమ్మగడ్డల బంధుత్వానికి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఐఏయస్ అధికారి…అంతే కాదు చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావుకు సమీప బంధువు. ఐఏయస్ అధికారిగా వివిధ పదవులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రిటైర్ అయిన నిమ్మగడ్డను ఏరికోరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు. అయితే తొలుత నేను రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా బిశ్వాల్ పేరు ప్రతిపాదించాను..కాని నాటి గవర్నర్ నరసింహన్ రమేష్‌కుమార్ అవకాశం ఇవ్వమని చెప్పడంతో ఆయన్ని ఎన్నికల కమీషనర్‌గా నియమించాను అని చంద్రబాబు నాలిక మడతేస్తున్నాడు.
కాగా స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం ముందు రోజు ఎన్నికల సంఘం నుండి కలెక్టర్లకు లేఖ వచ్చింది. అందులో కేవలం కోడ్ కారణంగా ఇళ్ళ స్థలాల పంపిణి నిలుపుదల చేయాలని మాత్రమే సూచించారు. కానీ, రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ఆ రాత్రి ఏం జరిగిందో కాని తెల్లారేసరికి స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. అసలు ఎన్నికల వాయిదాపై సీయస్ ఇతర అధికార యంత్రాంగంతో కాని, సీఎంతో కాని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఇలా ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కుమార్తెకు కీలక పోస్టు ఇచ్చిన విషయం ఇప్పుడు బయటపడింది. 2016లో అప్పటికే రిటైర్ అయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన చంద్రబాబు..వెంటనే ఆయన కుమార్తె శరణ్యను ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్‌గా నియమించి . ఆమెకు ఏకంగా నెలకు రూ.2 లక్షల వేతనం చెల్లించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఘోర ఓటమి పాలవుతున్న తరుణంలో ఇలా ఎన్నికలను వాయిదా వేయించి నిమ్మగడ్డ చంద్రబాబు రుణం తీర్చుకున్నాడని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక చంద్రబాబు సైతం అధికార పార్టీ ఏం చేసినా..తాము చూస్తూ కూర్చోవాలా అంటూ ప్రశ్నించటంతో వైసీపీ తనవాదనకు మరింత పదును పెట్టింది. కాని రమేష్ కుమార్ మాత్రం తన విచక్షణాధికారం ప్రకారం కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారు. అయితే నిమ్మగడ్డ విచక్షణా అధికారంతో కాదు విచక్షణ కోల్పోయి ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కుట్ర వెనుక చంద్రబాబు, నిమ్మగడ్డల మధ్య ఉన్న బంధం గురించి షాకింగ్ విషయాలు బయటపడడం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది.