ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘దేశంలో 50-60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి…
ద్వంద్వ వైఖరి ఎందుకు? కుల, మత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా కొనసాగుతామని ప్రమాణం చేస్తాం. ముస్లింలను మినహాయించి చట్టం అనడం ఎంతవరకు సబబు. ఎంఐఎం, మేము కలిసి పనిచేస్తాం..దాంట్లో అనుమానం లేదు. కొన్ని విషయాల్లో మజ్లిస్, మా అభిప్రాయాలు ఒకటిగా ఉండొచ్చు. కానీ, కొన్ని విషయాల్లో విభేదిస్తాం.. మా అభిప్రాయాలు మావి.’అని కేసీఆర్ స్పష్టం చేశారు.
‘370 అధికరణ విషయంలో మొట్టమొదట మద్దతు ఇచ్చింది మేమే. పౌరసత్వం ఇచ్చేది ఉంటే రాద్ధాంతం ఎందుకు ..నేరుగా ఇవ్వండి. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది దేశానికి శ్రేయస్కరం కాదని కేంద్రానికి మేము సూచిస్తున్నాం. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్ష చేసుకోవాలి. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తాం. సీఏఏపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి.. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నామని’ సీఎం కేసీఆర్ కోరారు.