స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ప్రభుత్వంతోకాని, అధికార యంత్రాంగంతో కానీ సంప్రదించకుండా ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన సామాజికవర్గానికి చెందిన ప్రతిపక్ష టీడీపీకి కాపాడుకునేందుకుకే నిమ్మగడ్డ, చంద్రబాబుతో కుమ్మక్కై ఇలా ఎన్నికలను వాయిదా వేశారంటూ సీఎం జగన్ ఆరోపించారు. అంతేకాదు ఈసీ తీరుపై ఏకంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు.
గవర్నర్ పిలుపుమేరకు రాజ్ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇచ్చారు. సుమారు గంటకుపైగా సాగిన వీరిభేటీలో..ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్ కుమార్ నుంచి గవర్నర్ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని గవర్నర్ ఈసీకి క్లాస్ పీకినట్లు సమాచారం. అయితే గవర్నర్‌తో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించడానికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిరాకరించారు. సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రెస్‌నోట్ ద్వారా విడుదల చేస్తానని తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం రమేష్ కుమార్ ఎన్నికల సంఘం కార్యదర్శి, ఐజీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సర్వత్రా విమర్శలు వస్తున్ననేపథ్యంలో గవర్నర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. మరి విమర్శలకు, గవర్నర్ క్లాసుకు తలొగ్గి ఈసీ మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా నిర్వహిస్తారో లేదో చూడాలి.