స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రమంతటా టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం హింసాకాండ చెలరేగేలా ప్రత్యర్థులను రెచ్చగొడుతూ మరోవైపు అధికార పార్టీ వైసీపీ అరాచకం చేస్తుందంటూ బురద జల్లుతోంది. ఈ క్రమంలో తమను అడ్డుకుంటున్న పోలీసులపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పలమనేరులో టీడీపీ మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి పోలీసులపై బూతులతో విరుచుకుపడ్డారు. నా టైమ్ వచ్చినప్పుడు కాలితో తొక్కేసా నా..అంటూ బూతు పదజాలంతో పోలీసులపై చిందులు వేశారు. వివరాల్లోకి వెళితే..గంగవరం మండలం కంచిరెడ్డిపల్లికి చెందిన సోమశేఖర్‌రెడ్డి భార్య కామాక్షమ్మ మామడుగు సెగ్మెంట్‌కు ఎంపీటీసీగా టీడీపీ తరఫున నామినేషన్ వేసింది. అయితే నామినేషన్ల ఉప సంహరణ రోజు కుటుంబ సభ్యుల సూచనతో ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకుంది.
పలమనేరు పట్టణంలోని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇంటికి సమీపంలో తన బంధువుల ఇంటి వద్ద ఆమె ఉండగా, గంగవరం మండల టీడీపీ నాయకులు మాజీమంత్రితో కలసి ఆమెను విత్‌డ్రా చేయవద్దంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, సీఐ శ్రీధర్ సిబ్బందితో కలసి అభ్యర్థిని ఉన్న ఇంటి వద్దకెళ్లి టీడీపీ నాయకులను బయటకు పంపారు. ఆమెను బయటకు పిలిపించి, విచారించారు. తాను స్వచ్ఛందంగా నామినేషన్ విత్‌డ్రాకు వెళుతుంటే టీడీపీ నాయకులు వద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీంతో ఆమెకు రక్షణ కల్పించి గంగవరం పోలీసుల ద్వారా ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు. దీంతో తాము అనుకున్న పథకం సాగకపోవడంతో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అక్కడున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా టైమ్ వచ్చినప్పుడు కాలితో తొక్కేస్తా, ఇది పనికిమాలిన రాజకీయం’ అంటూ పోలీసులపై వీరంగం వేశాడు. పత్రికల్లో రాయలేని భాషలో దూషించారు. ప్రజలు చూస్తుండగానే పోలీసులు, ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కారు. దీంతో పోలీసులను దూషించిన విషయాలను అప్పటికప్పుడే ఎస్పీకి డీఎస్పీ సమాచారమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోలీసులు భద్రం చేశారు. కాగా జరిగిన సంఘటనను టీడీపీకి సానుభూతి దక్కేలా చేసే ప్రయత్నంలో భాగంగా మాజీ మంత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ఎంపీటీసీ అభ్యర్థిని పోలీసులే విత్‌డ్రా చేయించారని బురదచల్లే ప్ర యత్నం చేశారు. అయితే జరిగిన సంఘటనపై అభ్యర్థిని కామాక్షమ్మ గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను టీడీపీ వారే విత్‌డ్రా చేయవద్దంటూ బలవంతం చేశారని, దీంతో పలమనేరు పోలీసులు తనను కాపాడారని తెలిపారు. తాను కుటుంబ సభ్యుల సూచన మేరకు స్వచ్ఛందంగా నామినేషన్‌ను విత్‌డ్రా చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి నాటకం బట్టబయలైంది. కాగా తమను దూషించినందుకుగాను అమర్‌నాథ్ రెడ్డి కేసు నమోదు చేసేందుకు పలమనేరు పోలీసులు సిద్ధమవుతున్నారు.