కరోనా ఎఫెక్ట్ పేరుతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌పై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నారని మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించారని సీఎం జగన్ గుర్తుచేశారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తోందనే విషయమే కొందరికి దుర్వార్తగా తోచిందన్నారు. విచక్షణాధికారం పేరుతో కొత్త పద్ధతికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. ఇలా వ్యహరించే అధికారం రమేష్‌కుమార్‌కు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది..పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తే.. సంతోషించాల్సింది పోయి… ఎన్నికల ప్రక్రియ జరిగేదాకా ఆపేయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు ఇస్తారు…నిన్న ఈ లేఖ ఇచ్చి, ఇవాళ ఈ పొద్దున్న ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేశారు.. నిన్నటికీ ఇవ్వాళ్టికీ ఏం తేడా కనిపించింది..తేడా ఒక్కటే… వైయస్సార్‌సీపీ ఎంటీసీ, జడ్పీటీసీలను స్వీప్ చేస్తాఉండడం… వారికి దుర్వార్తగా కనిపించింది.. అది తట్టుకోలేక, జీర్ణించుకోలేక, చంద్రబాబు ఇంకా దారుణంగా దెబ్బతింటున్నారని, ఏకంగా ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేస్తున్నట్టుగా 4 పేజీల ఆర్డర్ వచ్చింది..పొద్దుటే 4 పేజీల ఆర్డర్ వచ్చింది..ఇంత పెద్ద ఆర్డర్ తయారవుతున్నట్టుగా ఎన్నికల కమిషన్‌లో ఉన్న చీఫ్ సెక్రటరీకే తెలియదు…ఎవరో రాస్తున్నారు? ఎవరో ఇస్తున్నారు? ఆ ఆర్డర్‌ను ఈయన చదువుతున్నాడు..ఇలా చేయడం ధర్మమేనా అంటూ సీఎం జగన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ను నిలదీశారు.
ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇస్తేనే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే మేనిఫెస్టోలో చెప్పిన 90 శాతం అంశాలను పూర్తి చేశామని గుర్తుచేశారు. ప్రజలకు మేలు చేస్తుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అడుగు ముందుకు పడకూడదు, రాష్ట్రానికి నిధులు రాకూడదని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. మార్చి 31లోగా ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి ఇచ్చి ఉండొచ్చు, వారిద్దరు ఒకే సామాజిక వర్గం కావొచ్చు.. కానీ ఇంత వివక్ష చూపడం ధర్మమేనా అని ప్రశ్నించారు. పోలీసులు అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పోలీసులు ఎక్కడ ప్రేక్షక పాత్ర పోషించలేదని తెలిపారు. రమేష్ కుమార్ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఆయనలో మార్పు రాకపోతే.. పై స్థాయికి దీనిని తీసుకెళ్తామని చెప్పారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం జగన్ వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.