దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు మార్చి 8న హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌లో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అమృత అమ్మ దగ్గరకు వెళ్లు అంటూ తన కూతురిని ఉద్దేశిస్తూ లేఖ రాసి మరీ మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మారుతీరావు అంత్యక్రియలకు అమృతా ప్రణయ్ వెళ్లినా తల్లి గిరిజ, బాబాయ్ శ్రవణ్‌తో సహా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అభ్యంతరం చెప్పారు. దీంతో అమృతా ప్రణయ్ తన తండ్రి చివరి చూపుకు నోచుకోకుండానే వెనుదిరిగింది. అయితే ఎట్టకేలకు మార్చి 14 సాయంత్రం అమృత పోలీసుల రక్షణ మధ్య తన గిరిజను ఇంటికి వెళ్లి కలిసింది. తన తల్లిని కలవాలని, రక్షణ కల్పించాలని ఆమె గతంలో జిల్లా పోలీసులను కోరినట్లు సమాచారం. దీంతో రెడ్డి కాలనీలోని మారుతీరావు నివాసానికి ముందుగా వచ్చిన పోలీసులు వారి బంధువులను, కుటుంబ సభ్యులను ఇంటి పైఅంతస్తుకు పంపించారు. అనంతరం పోలీసుల రక్షణతో తన తల్లిని కలిసిన అమృత కొంత సమయం ఆమెతో గడిపింది.
కాగా పోలీసులు ఈ సమాచారం బయటికి పొక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తల్లిని కలిసిన అమృత పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. తన తల్లిని కలిసిన సమయంలో వారి బంధువులను సైతం ఎవ్వరిని వారి వద్ద ఉండనీయలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ రావు ఆస్తి నాకు అవసరం లేదని, ఆస్తి కోసం తాను ఏ న్యాయ పోరాటం చేయబోనని ప్రకటించడం తెలిసిందే. కాగా తల్లీ కూతుళ్లు ఆ పది నిమిషాలు ఏమి మాట్లాడుకున్నారు..? వారి భ విష్యత్తుపై ఏమైనా చర్చ జరిగిందా..? కేసు వివరాలు చర్చకు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా అమృత తన తల్లి గిరిజను కలిసిన సమయంలో బాబాయి శ్రవణ్ కూడా ఇంట్లో నే ఉన్నాడని సమాచారం. తల్లీ కూతుళ్ల మధ్యే చర్చలు జరి గాయా..? లేక అమృత తన బాబాయితో కూడా మాట్లాడిందా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరి ఆ పది నిమిషాలు తన తల్లితో అమృత ఏం మాట్లాడిందనే విషయాలు ఇంకా బయటపడాల్సింది. కాగా తన తండ్రి మారుతీరావు చివరికోరిక ప్రకారం అమృత తన తల్లి దగ్గరకు వెళ్లడానికి అంగీకరించలేదు. కాకపోతే తన తల్లి తన దగ్గరకు వస్తే చూసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. మొత్తంగా తన తండ్రి మరణానంతరం నాలుగు రోజుల తర్వాత అమృత ఊహించని విధంగా తల్లిని కలవడంతో మిర్యాలగూడలో చర్చనీయాంశంగా మారింది.