స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం కానీ మావాళ్లు కానీ పోటీ చేయడం లేదని ప్రకటించిన జేసీ దివాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నానా హంగామా చేశాడు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జేసీ బ్రదర్స్ మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు కార్యాలయం వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.కాగా, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. టీడీపీ తరపున నామినేషన్ వేస్తున్నవారిని అడ్డుకుని బెదిరిస్తున్నారని 36వ వార్డు టీడీపీ అభ్యర్థిని జింక లక్ష్మీదేవి ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకుపోయాడు. దీంతో జేసీని పోలీసులు అడ్డుకున్నారు. ఆల్రెడీ కార్యాలయంలో కేతిరెడ్డి హర్షవర్ధన్ ఉన్నందున, అనవసరంగా గొడవలు రెచ్చగొట్టద్దని, తర్వాత పంపిస్తామని పోలీసులు జేసీకి తెలిపారు. అయితే జేసీ మాత్రం తనదైన శైలిలో వైసీపీ శ్రేణులను దుర్భాషలాడుతూ.. పోలీసులపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు జేసీని చుట్టుముట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వైసీపీ కార్యకర్తల నుంచి సురక్షితంగా అక్కడ నుంచి పంపించారు. ఈ ఘటన నేపథ్యంలో భారీ ఎత్తున వైసీపీ, టీడీపీ దిన నేతలు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఓవరాక్షన్ చేసిన టీడీపీ వివాదాస్పదనేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ కార్యకర్తలు చుక్కలు చూపించారు.
