మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై వైసీపీ కార్యకర్త కర్రలతో దాడి చేసిన సంఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అయితే మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను మరింత రెచ్చగొట్టేందుకు చంద్రబాబు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను పంపించాడని, వారు పది కార్లలో వేగంగా వెళుతూ ఓ దివ్యాంగుడిని గుద్దుకుంటూ వెళితే..స్థానికులు కోపోద్రిక్తులై వారిని వెంబండించి దాడి చేశారని వైసీపీ అంటోంది. అయితే మాచర్లలో గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఉండగా..విజయవాడ నుంచి బోండా ఉమ, బుద్ధా వెంకన్నలు మాచర్లకు వెళ్లడం వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే రెచ్చగొట్టి వైసీపీ దాడులంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్కెచ్ మేరకు బుద్ధా, బోండా మాచర్లకు వెళ్లినట్లు తెలుస్తోంది.
తాజాగా మాచర్ల ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు.మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమాచర్ల ఎందుకు వెళ్లారో..అక్కడి నుంచి విజయవాడకు ఎలా వచ్చారో విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు.
మాచర్లలో ఘటన జరిగితే అక్కడి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని డిజీపీ ప్రశ్నించారు. వాస్తవాలను పక్కదారి పట్టించి ఘటనను వక్రీకరిస్తున్నారని, పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ అన్నారు. మాచర్ల ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించమని ఆదేశించామని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా విజయవాడ నుంచి మాచర్లలో ఘటన జరిగే వరకు బోండా ఉమ, బుద్ధా వెంకన్నల కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. వాళిద్దరూ ఎందుకు మాచర్ల వెళ్లారు, ఎప్పుడు పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. దీనిపై బోండా ఉమ, బుద్ధా వెంకన్న తమకు స్టేట్‌మెంట్ ఇవ్వాలని అన్నారు. మొత్తంగా మాచర్ల ఘటన కీలక మలుపు తిరుగుతుంది. వైసీపీ నేతలను కావాలనే రెచ్చగొట్టి పల్నాడులో అరాచకం సృష్టించడానికే ఓ పథకం ప్రకారం చంద్రబాబు బోండా, బుద్ధా వెంకన్నలను మాచర్లకు పంపించాడన్న ఆరోపణల నేపథ్యంలో వారిద్దరి కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించడంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.