స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైసీపీలోకి మొదలైన వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీ చాఫ్టర్ పూర్తిగా క్లోజ్ కానుంది. కడప జిల్లాలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తన కొడుకుతో సహా జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ బాట పడుతున్నారు. ఇక కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేయడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.
తాజాగా జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీలో చేరారు. వైసీపీ రాయలసీమ రీజినల్ కోఅఆర్టినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి పి. అనిల్‌కుమార్ యాదవ్, నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి సమక్షంలో ఐజయ్య వైసీపీ కండువా కప్పుకున్నారు. ఐజయ్య తోపాటు టీడీపీకి చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శింగారం రంగా తదితరులు వైసీపీలో చేరారు.
కాగా ఐజయ్య 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి పోటీ చేశారు. అయితే 30 వేలకు పైగా ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆర్ధర్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిని ఒప్పించి ఆ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు, బైరెడ్డి వర్గాల మధ్య విబేధాలు పెరిగిపోతున్న తరుణంలో బైరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఐజయ్యను వైసీపీలోకి తిరిగి తీసుకురావడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఐజయ్య చేరికపై ఎమ్మెల్యే ఆర్థర్ ఎలా స్పందిస్తారో చూడాలి.