కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన ఈ నెల 11 వతేదిన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలో ఉంది. దశాబ్దాల పాటు టీడీపీలో ఉండి సేవలు అందించడమే కాకుండా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాం. నేను జైల్లో ఉన్నా మా కార్యకర్తలు టీడీపీలో ఉన్నారు. మా కార్యకర్తల అభిప్రాయం మేరకే నేను స్వచ్ఛందంగా వైసీపీలో చేరాను. మమ్మల్ని ఎవరూ బెదిరించడం లేదు. మనస్ఫూర్తిగా వైసీపీలో చేరాం. టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక పార్టీ మారుతున్నాం అని తెలిపారు. అంతేకాదు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేస్తున్నారు. జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, సంక్షేమ పథకాలను సీఎం జగన్ చేపట్టారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఒక డైనమిక్ లీడర్ షిప్‌తో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం మంచి నిర్ణయం. ప్రజాదరణతో ఏర్పడిన ప్రభుత్వంలో పాలుపంచుకోవాలని మేం వచ్చాం. పార్టీలో చేర్చుకున్నందుకు జగన్ గారికి కృతజ్ఞతలు. టీడీపీలో లోపాలు గుర్తించారు కాబట్టే ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ స్వీప్ చేస్తుంది’అని అన్నారు.
