తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2020-21ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఖర్చుపై గురువారం సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానంలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఇస్తున్నామని చెబుతోందని, అది బిచ్చమెత్తుకునేది కాదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా అంటూ ‘కిసీకా బాప్‌కా హై’అని వ్యాఖ్యానించారు.
తర్వాత సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతాంగానికి ఇచ్చే నిధులు ‘మీ జేబుల్లోంచి ఇచ్చారా..? టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి తెచ్చారా’అని ఘాటుగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు ‘కిసీ కా జాగీర్ నహీ హై… కిసీకా బాప్‌కా నహీ హై’అని అన్నారు.దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అధికార సభ్యులు భట్టి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు.
మీరు ఎస్సారెస్పీ కట్టామని చెబుతున్నారు.. ఆ నిధులు మీ ఇంట్లోంచి తెచ్చారా అని భట్టిని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజాధనం ఖర్చు విషయంలో భట్టి మాట్లాడిన మాటలు అసంబద్ధమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ద్వారా రాష్ట్ర రైతాంగానికి సాయం చేయాలన్న సోయి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సంపద పెంచాలి… పేదలకు పంచాలి.. అనేది తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. మొత్తంమీద ప్రజాధనం మీద చర్చ పార్టీల మధ్య విమర్శలకు దారితీసింది.