ఏపీలో వలసల రాజకీయం మొదలైంది. ప్రతిపక్షం టీడీపీని వీడి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు.
ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో సీఎం సొంత జిల్లా కడప నుండి ఇద్దరు కీలక నేతలు వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, ఇప్పుడు కర్నూలు జిల్లాలో వలసలు మొదలు అయ్యాయి.కర్నూలు జిల్లాలో రాజకీయంగా పేరున్న కేఈ కుటుంబం నుండి ఇప్పుడు వలస బాట పడుతున్నారు. 2019 ఎన్నికల ముందు నుండి ఆయన పార్టీ అధినాయకత్వం తీరు పట్ల అసహనంతో ఉన్నారు. అయితే, ఫలితాల తరువాత నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో అప్పట్లో పార్టీ మార్పు ప్రతిపాదన ఆయన సోదరుడు కేఈ క్రిష్ణమూర్తి సూచన మేరకు విరమించుకున్నారు. అయితే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేఈ ప్రభాకర్ టీడీపీ వీడారు. టికెట్ల కేటాయింపు విషయమపై ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశమయ్యి డిసైడ్ అయ్యారు. ఇక తన రాజకీయ భవిష్యత్ పైన తన ఆలోచన ఏంటనేది స్పష్టత ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వకుండా..నిర్లక్ష్యం చేయటం పైనా ప్రభాకర్ రాజీనామా చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
