స్థానిక సంస్థల ఎన్నికల టైమ్‌లో ఇప్పటికే బలహీనపడిన టీడీపీ కోట పూర్తిగా శిథిలమవుతుంది. డొక్కాతో మొదలైన వలసలు ఇప్పట్లో ఆగలేవు. అన్ని జిల్లాలలో టీడీపీ సీనియర్ నేతలంతా వైసీపీలో చేరుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ మాజీమంత్రులు కూడా వైసీపీలో చేరడం చంద్రబాబును షాక్‌కు గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ ఛాఫ్టర్ పూర్తిగా క్లోజ్ కానుంది. ఇప్పటికే బాలయ్య సన్నిహితుడు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అలాగే దశాబ్దాలుగా టీడీపీ ఎమ్మెల్యేగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన బలమైన నేత, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేరు రామారావు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బలరాం మాత్రం అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోలేదు. అయితే కరణం బలరాం ఇక నుంచి అసెంబ్లీలో స్వతంత్ర్యంగా వ్యవహరిస్తూనే వైసీపీకి మద్దతు పలుకుతారు.
తాజాగా మరో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా తన కుమారుడు శిద్ధా సుధీర్ కుమార‌్‌తో కలిసి వైసీసీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో శిద్ధారాఘవరావు ఒంగోలు లోకసభ నుంచి, ఆయన కొడుకు సుధీర్ కుమార్ కనిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి శిద్దా కుటుంబం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శిద్ధా రాఘవరావు కూడా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు గత కొద్ది రోజులుగా జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో శిద్ధా పార్టీ మార్పుపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే సీఎం జగన్ సమక్షంలో మాజీమంత్రి శిద్ధా రాఘవరావు, కొడుకు సుధీర్ రెడ్డితో కలిసి వైసీపీలో చేరుతారని ప్రకాశం జిల్లాలో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇలా టీడీపీ మాజీమంత్రులంతా పార్టీకి గుడ్‌బై చెబుతుండడంతో ఈ వలసలను ఎలా ఆపాలో అర్థం కాక చంద్రబాబు తలపట్టుకుంటున్నాడు. మొత్తంగా శిద్దా చేరికతో ప్రకాశం జిల్లాలో టీడీపీ దుకాణం క్లోజ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.