దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలింగ్ కంటే ముందే మద్యం షాపులు మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని కర్నూల్ జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. గ్రామాల్లో ఎక్కడా డబ్బులు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. నందికొట్కూర్లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని, టీడీపీ ఖాళీ అవుతుందన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నందికొట్కూర్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. అందరం కలిసికట్టుగా అన్ని స్థానాలను కైవసం చేసుకుని సీఎం జగన్కు బహుమతిగా అందిద్దామని పిలుపునిచ్చారు.
