స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన టీడీపీ సీనియర్ నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే డొక్కా, రెహమాన్, కదిరి బాబురావు, రామసుబ్బారెడ్డి వంటి టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. ఇక కడప జిల్లా పులివెందులలో టీడీపీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు సతీష్ రెడ్డి కూడా రేపో, మాపో వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, గొట్టిపాటి రవిలు వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తన పార్టీ కార్యకర్తలతో, అనుచరులతో సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన కూడా చేశారు. వెంటనే చీరాలలోని తన కార్యాలయం నుంచి భారీగా అనుచరులు, కార్యకర్తలతో కలిసి అమరావతికి బయలుదేరారు. సీఎం జగన్ సమక్షంలో కరణం బలరాంతో పాటు ఆయన తనయుడు కరణం వెంకటేష్ కూడా వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
అయితే స్థానిక సంస్థల వేళ ఇలా వైసీపీ తన పార్టీ నేతలను చేర్చుకుని దెబ్బతీస్తుందని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు ఏ మాత్రం ఊహించలేకపోయాడు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన సీనియర్ నేతలు జగన్ సమక్షంలో కండువా కప్పుకుని వైసీపీలో చేరుతుండడంతో చంద్రబాబు అవాక్కు అవుతున్నాడు. కాగా టీడీపీకి 30 ఏళ్లుగా విశ్వాసంగా పని చేసిన కరణంబలరాం కూడా పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించడంతో బాబు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కరణం బలరాం లాంటి సీనియర్ నేత లేకుంటే పార్టీ పరిస్థితి ఏంటీ..చీరాలకు ఇప్పుడు ఉన్నట్లుండి ఎవరిని ఇన్‌చార్జ్‌గా నియమించాలి అనే విషయమై జిల్లా నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మీటింగ్‌లో వైసీపీలో చేరుతాడని వార్తలు వస్తున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా ఉండడం గమనార్హం. అసలు గొట్టిపాటి రవి ముందుగా వైసీపీలో చేరుతాడని అందరూ ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బలమైన నేత కరణం బలరాం వైసీపీలో చేరుతుండడం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. కరణం బలరాం రాజీనామా నేపథ్యంలో చీరాలకు టీడీపీకి ఇన్‌చార్జిగా యడం బాలాజీని చంద్రబాబు నియమించినట్లు తెలుస్తోంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కరణం బలరాం నిష్క్రమణ టీడీపీపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి వైసీపీలోకి వెల్లువెత్తుతున్న వలసలను చంద్రబాబు ఎలా కట్టడి చేస్తాడో చూడాలి.