స్ధానిక సంస్థల ఎన్నికల వేళ..చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. రోజుకో టీడీపీ సీనియర్ నేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే…ఇప్పుడు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు..ప్రకాశంలో జిల్లాలొ ఒకే పార్టీలో ఉన్నా బద్ధ శత్రువులుగా వ్యవహరించే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లు. వీరిద్దరూ కలిసి ఒకేసారి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌ను కలవనున్నారు. ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు..వీరిద్దరి చేరికలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
కరణం బలరాం టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత…పార్టీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కరణం బలరాం తనదైన ముద్ర వేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లాలో కరణం బలరాందే హవా. అయితే కొంత కాలంగా కరణం బలరాం చంద్రబాబు కారణంగా పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. ఆ తర్వాత గొట్టిపాటిని చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి చేర్చుకున్నాడు. గొట్టిపాటి చేరికను కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా గొట్టిపాటికి ప్రాధాన్యత ఇచ్చి కరణం బలరాంను పక్కన పెట్టడం ప్రారంభించాడు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అద్దంకి నుంచి తనకే టికెట్ ఇవ్వాలని కరణం బలరాం వత్తిడి చేసినా చంద్రబాబు వినిపించుకోకుండా వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కే టికెట్ కట్టబెట్టాడు. దీంతో కరణం బలరాం తీవ్ర మనస్తాపం చెందారు.
అయితే ఎన్నికలకు ముందు చీరాల ఎమ్మెల్యే ఆమంచి వైసీపీలో చేరడంతో చంద్రబాబు బలరాంకు చీరాల టికెట్ ఇచ్చాడు. కాని సొంత నియోజకవర్గం అద్దంకిని వదులుకోవడం బలరాంకు ఇష్టం లేదు. అయినా చంద్రబాబు వత్తిడి చేయడంతో చీరాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా తన రాజకీయ ప్రత్యర్థి అయిన గొట్టిపాటి రవితో కలిసి వైసీపీలో చేరడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గత కొద్ది నెలలుగా గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాని కరణం బలరాం పార్టీ మారే ఆలోచనలో ఉన్న దాఖలా కనిపించలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉప్పు, నిప్పులా ఉన్న వీరిద్దరు కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. మొత్తంగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు బలమైన టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో అధికారికంగా చేరకపోయినా…వారు జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా వైసీపీలో చేరడంతో అసెంబ్లీలో టీడీపీ బలం 19కు పడిపోయింది. మరి గొట్టిపాటి, కరణం బలరాంల పార్టీ మార్పుపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.