స్థానిక సంస్థల ఎన్నికల వేళ..పల్నాడులో టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై జరిగిన దాడిపై చంద్రబాబు రోజంతా హైడ్రామా నడిపాడు. మాచర్లలో జరిగిన ఘర్షణను పెద్ద యుద్ధంగా చిత్రీకరిస్తూ..మా నాయకులను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ…చంద్రబాబు ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. గంటల వ్యవధిలో మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి..కోపంతో రంకెలు వేస్తూ చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెప్పి మీడియావాళ్లను కూడా విసిగించాడు. ఇక డీజీపీ కార్యాలయానికి అరగంటపాటు పాదయాత్ర చేసి బైఠాయించాడు.., పోలీసు అధికారులు లోపలకు రావాలని కోరినా తిరస్కరించి రోడ్డుపైనే కూర్చుని చంద్రబాబు చేసిన హంగామాకు నివ్వెరపోవడం జనాల వంతు అయింది.
అసలు పల్నాడులో ఫ్యాక్షన్ తగాదాలను రగిలించిందే చంద్రబాబు. టీడీపీ హయాంలో పల్నాడులో వైసీపీ నేతలను టీడీపీ శ్రేణులు వెంటాడి చంపారు. 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబుపై మాజీ స్పీకర్ కోడెల తనయుడు శివరామ్ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులు చేయించారు. ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడమే కాక ముస్తఫా, అంబటిలను తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు.
గత ఐదేళ్లలో పల్నాడులో దాదాపు పదుల సంఖ్యలో టీడీపీ గూండాల దాడిలో వైసీపీ నేతలు హతమయ్యారు. అంతెందుకు మొన్నటికి మొన్న రాజధాని రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాన్వాయ్‌పై కర్రలు, రాళ్లతో దాడులు చేసి ఆయన్ని హతమార్చేందుకు ప్రయత్నించారు. అమరావతిలో మండలం లేమళ్ల గ్రామంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కారం చల్లి దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కారును టీడీపీ గూండాలు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. అయితే ఇవన్నీ మర్చిపోయి చంద్రబాబు నిన్న జరిగిన ఘటనపై రాజకీయం చేస్తున్నాడు.
అంతెందుకు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాప్రయత్నం జరిగితే కోడి కత్తి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఎగతాళి చేశాడు. అప్పుడు డీజీపీ, హోంమంత్రితో సహా, టీడీపీ నేతలంతా కోడికత్తి అంటూ ఎంత ఘోరంగా అవమానించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు పల్నాడులో జరిగిన ఘటనను మాత్రం చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. అయ్యా బాబుగారు మీ డ్రామాలను ప్రజలు నమ్మే రోజులు పోయాయా…మీరు చేసిన ఘోరాలే మీకు తగులుతుండేసరికి మీకు బాగా నొప్పి అనిపిస్తోంది..అందుకేనేమో ఇలా రంకెలు వేస్తున్నారు. ఒకసారి ఎదుటివాళ్లను విమర్శించే ముందు తమరు ఏం చేసారో చూసుకోండి..జనాలకు అన్నీ తెలుసు..హుందాగా ఉంటే బెటర్…లేకుంటే…ఇంకా ప్రజల చేతిలో ఛీత్కారం తప్పదు.