స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై విసిగిపోయి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరణం వెంకటేష్‌తో పాటు మాజీ మంత్రి పాలేటీ రామారావు కూడా వైసీపీలో చేరారు. కాగా మార్చి 12న మధ్యాహ్నం సీఎం జగన్‌ను కలుస్తున్నట్లు కరణం బలరాం స్వయంగా మీడియాకు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ అనుకూల పవనాలు వీచినా నియోజకవర్గ ప్రజలు తనను 20 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం జగన్ దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని తన సన్నిహితులు, మద్దతుదారులతో సమాలోచనల తర్వాత వైసీపీ గూటికి చేరాలని కరణం బలరాం నిర్ణయం తీసుకున్నారు.
కాగా ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఇప్పటికే వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. ఇప్పుడు కరణం బలరాం తన కొడుకుతో సహా కూడా వైసీపీ గూటికి చేరారు. అయితే కరణం బలరాం జగన్ సమక్షంలో కండువా మాత్రం కప్పుకోలేదు. సీఎం జగన్ మొదటి నుంచి పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెబుతున్నారు. ఈ మేరకు జగన్‌తో కండువా కప్పించుకుంటే అనర్హత వేటు పడుతుందనే కారణంతో కరణం బలరాం కేవలం తన కుమారుడు వెంకటేష్‌ను మాత్రమే అధికారికంగా వైసీపీలో చేర్పించినట్లు తెలుస్తోంది.
ఇక వల్లభనేని వంశీ, మద్దాలి గిరి తరహాలో కరణం బలరాం కూడా అసెంబ్లీలో స్వతంత్ర్యంగా వ్యవహరిస్తూనే వైసీపీకి మద్దతు పలుకుతారని తెలుస్తోంది. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ..ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చీరాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. కరణం బలరాంను వైసీపీ గూటికి తీసుకురావడంతో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొత్తంగా దశాబ్దాలుగా టీడీపీ నేతగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన కరణం బలరాం వైసీపీలో చేరడం ఏపీ రాజకీయాల్లో సంచలంగా మారింది. మరి కరణం బలరాం పార్టీ మార్పుపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.