అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గ్రామాల రైతులతో గతమూడు నెలలుగా ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి గంటాతో సహా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో సహా కీలక నేతలంతా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ ఓ తీర్మానం ఆమోదించి చంద్రబాబుకు పంపారు. అయినా చంద్రబాబు మాత్రం అమరావతికే జై కొడుతున్నాడు. కాగా చంద్రబాబు మెప్పుకోసం కొందరు విశాఖ టీడీపీ నేతలు అమరావతి పాట పాడుతున్నారు. అయితే తన మాట వినకుండా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతించిన కొందరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో వారిని పక్కనపెట్టి అవమానిస్తున్నట్లు విశాఖ టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇదే కారణంపై యలమంచిలి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని పంచకర్ల రమేశ్‌బాబు తెలిపారు. సీతమ్మధారలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాకు గల కారణాలను పంచకర్ల వివరించారు.
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడాన్ని తనతో పాటు చాలామంది జిల్లా నాయకులు స్వాగతించారని, అందుకే వైజాగ్‌లో కేపిటల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా తాను నిరసన కార్యక్రమాలు చేపట్టలేదని…ఇది మనసులో వుంచుకొని అధిష్ఠానం తనను ఇబ్బంది పెడుతోందని పంచకర్ల ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫారాలు పార్టీ అధ్యక్షుడైన తన చేతుల మీదుగా పంపిణీ చేయాల్సి ఉందని..కాని విశాఖ నగరంలో వాసుపల్లి గణేష్‌కుమార్ ఇస్తున్నారని, రూరల్‌లో అయినా బీ ఫారాలు ఇచ్చే బాధ్యత తనకు ఇవ్వాల్సి ఉందని, అయితే పార్టీ అధిష్ఠానం ఆ బాధ్యత అయ్యన్నపాత్రుడుకు అప్పగించడం తన మనసుకు బాధ కలిగించిందని పంచకర్ల ఆవేదన చెందారు. అదే విధంగా యలమంచిలి నియోజకవర్గానికి తాను ఇన్చార్జిగా వుండగా, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తనకు మాట మాత్రం చెప్పకుండా అక్కడ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై ఇప్పటివరకు చంద్రబాబునాయుడు సరైన సమీక్ష నిర్వహించలేదన్నారు. త్వరలో కార్యకర్తలతో సమావేశమై తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని రమేష్ బాబు మీడియాకు తెలిపారు. కాగా పంచకర్ల రమేష్‌బాబు త్వరలో వైసీపీలో చేరడం ఖాయమని జిల్లాలో చర్చ జరుగుతోంది.