వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ నానాటికి భూస్థాపితమవుతోంది. ఇప్పటికే కడప జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, పులివెందుల ఇన్‌చార్జీ సతీష్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మాజీమంత్రి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి , రాయచోటికి చెందిన మరో సీనియర్ నేత, పాలకొండ్రాయుడు సైతం వైసీపీలో చేరనున్నారు. అయితే ప్రొద్దుటూరు టీడీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య విబేధాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. ప్రొద్దుటూర్‌లో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి చంద్రబాబు పార్టీ బాద్యతలు అప్పగించాడు. అయితే ఈయన వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డితో లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నారని బాబుకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కొన్నాళ్ల పాటు లింగారెడ్డి విషయంలో సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డిని నియమించాడు. దీంతో అప్పటి వరకు ఉన్న లింగారెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టినట్లైంది.
అయితే చంద్రబాబు తీరుపై లింగారెడ్డి గరం గరంగా ఉన్నారు. 2014లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సీటును లింగారెడ్డి ఆశించగా చంద్రబాబు మాత్రం వరదరాజులు రెడ్డికి ఇచ్చాడు. కాని వైసీపీ అభ్యర్థి రాచమల్లు చేతిలో ఆయన ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం లింగారెడ్డికే టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో చంద్రబాబు ఇప్పుడు లింగారెడ్డికి చెక్ పెట్టడానికే ఉక్కు ప్రవీణ్ కుమార్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగానే ఉక్కు ప్రవీణ్‌ను నియమించారని, ఎప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా తానే కొనసాగుతానంటూ లింగారెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కడప జిల్లాలో వైరల్‌గా మారింది.
కాగా లింగారెడ్డికి ప్రవీణకుమార్ అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. ఇక ప్రొద్దుటూర్‌కు ఎప్పటికీ ప్రవీణే అని, లింగారెడ్డి ఇక రాజకీయాల్లోంచి రిటైర్ కావడం బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతే కాదు ప్రొద్దుటూర్‌లో పార్టీ బతకాలంటే.. అది లింగారెడ్డి వల్ల కాదని, ఏ విషయాన్నైనా ఇట్టే పరిష్కరించే డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వల్లనే సాధ్యమని ఆయన అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో ఇరువురు కీలక నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోవడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే కడప జిల్లాలోె టీడీపీ ఛాప్టర్ క్లోజ్ అయ్యే సూచనల నేపథ్యంలో ప్రొద్దుటూరులో కీలక నేతల మధ్య విబేధాలు చంద్రబాబును కలవరపెడుతున్నాయి. మరి ఈ ఇద్దరి మధ్య విబేధాలను చంద్రబాబు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.