స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరు పొందింది. దళితులకు, బీసీలకు, ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. పుష్పరాజ్, మోత్కుపల్లి, బాలయోగి వంటి ఎందరో దళిత నేతలకు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్రమంగా దళితులకు, బీసీలకు దూరమవుతూ వస్తుంది. చంద్రబాబులో మొదటి నుంచి కులాభిమానం ఎక్కువ. గత 30 ఏళ్లుగా తన సొంత కులం ప్రయోజనాలకు పాకులాడుతూనే ఉన్నారు. తన సామాజికవర్గం వారికే రాజకీయంగా, ఆర్థికంగా చేయూతనిచ్చారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ చౌదరి, మురళీమోహన్ చౌదరి వంటి తన సామాజికవర్గం నేతలకు పెద్ద పీట వేశాడు. సుజనా చౌదరిని ఏకంగా కేంద్ర మంత్రిని చేశాడు. ఇక చంద్రబాబుకు ఎందుకనో మొదటి నుంచి దళితులంటే చిన్నచూపు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించి దళితుల పట్ల తనకున్న ఏహ్యభావాన్ని, తన కుల అహంకారాన్ని బయటపెట్టుకున్నాడు.
ఇక రాజ్య సభ ఎన్నికల్లో అవకాశం ఉన్నప్పుడల్లా తన సామాజికవర్గానికే పెద్దపీట వేశాడు. 2002 నుంచి దళితులను రాజ్యసభ సీటు ఇస్తానని ఆశపెట్టి తీరా ఎన్నికలు వచ్చే సమయానికి తన కులం వారికి కేటాయించి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా.. తన సొంత సామాజిక వర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. ఆ సమయంలో తెలంగాణకు చెందిన దళిత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ సీటివ్వాలని అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇక 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉండగా ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చి, టీడీపీ నుంచి టీజీ వెంకటేష్‌కు రెండో సీటు ఇచ్చారు. మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన కోటరీ వ్యక్తి, సన్నిహితుడు సుజనా చౌదరికే కేటాయించారు. అదే సమయంలో టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. కాని గెలిచే అవకాశం ఉన్నచోట దళితులకు ఇద్దామన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదు.
అలాగే 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు రెండోసారి ఇచ్చారు. మరో సీటును వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు. ఇలా 2002 నుంచి ఇప్పటివరకూ పలుమార్లు రాజ్యసభకు టీడీపీ నాయకుల్ని పంపే అవకాశం వచ్చినా ఎప్పుడూ దళితులను చంద్రబాబు పట్టించుకోలేదు. కాని ఇప్పుడు టీడీపీ గెలిచే పరిస్థితి లేని చోట దళిత నేత వర్ల రామయ్యకు కేటాయించి..చూడండి దళితుల పట్ల నాకున్న చిత్తశుద్ది అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. చంద్రబాబు మోసంపై దళితులు మండిపడుతున్నారు. అలాగే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పుడు గవర్నర్‌గా పంపిస్తానని మోత్కుపల్లిని నమ్మించి మోసం చేశాడు. మొత్తంగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గెలవని సీటు వర్లరామయ్యకు కేటాయించి చంద్రబాబు దళితులకు మరోసారి అన్యాయం చేస్తున్నాడు. దీంతో గెలిచే సీటు నీ కుల పెద్దలకా, ఓడిపోయే సీటు దళితులకా..ఎంత మోసం చంద్రయ్యా అంటూ దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.