స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చురేపాలని కుట్రలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో గుంటూరు జిల్లాలోని మాచవరంలో నామినేషన్లు వేయడానికి వెళ్లగా వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరావు, మాజీ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్నలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు 10 కార్లలో మాచవరానికి బయలుదేరారు. అయితే మాచర్ల సమీపంలో వేగంగా వెళుతున్న టీడీపీ నేతల కార్లను కొందరు స్థానిక యువకులు వెంబడించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నేతల కారు అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కాగా టీడీపీ నేతల కారుపై దాడి చేసిన యువకుడు కాల్‌మనీ బాధితుడు అని తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో కాల్‌మనీ బాగోతంలో అమాయక మహిళల ధన, మాన ప్రాణాలతో టీడీపీ నేతలు చెలగాటం ఆడారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. కాల్ మనీ ఆరోపణలు ఎదుర్కున్న టీడీపీ నేతల్లో బుద్ధా వెంకన్న కూడా ఉన్నారు. అందుకే కాల్‌మనీ బాధితుడే బుద్ధా వెంకన్న కారుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ కార్యకర్తలే తమ నేతలపై దాడికి పాల్పడ్డారంటూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు.
ఇక టీడీపీ నేతల ఆరోపణలపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని పిన్నెల్లి ఫైర్ అయ్యారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించారని పిన్నెల్లి ఆరోపించారు. మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఓ పిల్లాడికి తగిలిందని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని తెలిపారు. వారిని సముదాయించాల్సింది పోయి బోండా సహా ఇతర టీడీపీ నాయకులు దుర్భాషలాడారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమని, అందులో భాగంగానే 10 కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారని తెలిపారు. ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పిన్నెల్లి విమర్శించారు.. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, ముస్తాఫాలపై దాడులు చేసి చంపడానికి యత్నించారని ఈ సందర్భంగా పిన్నెల్లి గుర్తు చేశారు. మొన్నటికి మొన్న అమరావతి రైతుల ముసుగులో టీడీపీ గూండాలు తన కాన్వాయ్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేసి, తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అయినా తాము సంయమనంతో వ్యవహరించామని పిన్నెల్లి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బోండా, బుద్ధాలను కొట్టారంటూ చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్లీ అలజడి రేపటానికి ప్రయత్నిస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా బుద్ధా వెంకన్నపై దాడి చేసింది కాల్‌మనీ బాధితుడే అని తెలుస్తోంది. దీన్ని బట్టి టీడీపీ నేతల అరాచకాలపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఈ ఘటన అద్దం పడుతోంది. మొత్తంగా పల్నాడులో జరిగిన ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది.