విశాఖ జిల్లాలో టీడీపీ వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు జై అమరావతి నినాదంతో విశాఖలో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్ వద్ద ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఘోర అవమానం ఎదురైంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై పదేపదే విషం కక్కుతున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రజల్లోకి వచ్చేందుకు భయపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మే నెలలో విశాఖ నుంచి పరిపాలనా రాజధానిని ప్రారంభించి కార్యకలాపాలు మొదలుపెడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీసీ పట్ల ఉత్తరాంధ్ర ప్రజల్లో ముఖ్యంగా విశాఖ ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుంది. దీంతో టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతో ఆ పార్టీ నేతలు వైసీపీలో చేరుతున్నారు.
ఇటీవల విశాఖ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ లు కూడా టీడీపీ వీడారు. త్వరలో పంచకర్ల తన అనుచరులతో చర్చించి వైసీపీలో చేరనున్నారు. 2009లో చిరంజీవి స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన పంచకర్ల రమేష్ బాబు ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రాష్ట్ర విభజన నేపథ‌్యంలో టీడీపీలో చేరిన ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో యలమంచిలి నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్‌లో వైసీపీ అభ్యర్థి కన్నబాబు రాజు చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే విశాఖలో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు చేస్తున్న కుట్రలతో పంచకర్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద చంద్రబాబుకు ఘోర అవమానం జరుగుతున్నా పంచకర్ల అక్కడ కనిపించలేదు. గత ఆరునెలలుగా పార్టీ మారే విషయంపై వైసీపీ నాయకుడు తోట త్రిమూర్తులుతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రమేష్ బాబు ఇవాళ సాయంత్రం లేదంటే రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డొక్కా, రెహమాన్, కదిరి బాబురావు వంటి టీడీపీ సీనియర్ నేతలు వైసీపీలో చేరగా రేపోమాపో సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పుడు విశాఖలో టీడీపీ సీనియర్ నేత అయిన పంచకర్ల రమేష్ బాబు కూడా పార్టీ మారడం టీడీపీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. మొత్తంగా విశాఖలో వలసల పర్వం మొదలవడంతో చంద్రబాబులో కలవరం మొదలైంది.