దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న యస్ బ్యాంకు సంక్షోభంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో పాటు 600 కోట్ల ముడుపుల బాగోతంలో ఈడీ అరెస్ట్ చేసింది. అయితే యస్ బ్యాంకు వ్యవస్థాపక ఛైర్మన్ రాణాకపూర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ సొమ్ము 1300 కోట్లు యస్ బ్యాంక్‌లో డిపాజిట్లు చేయించాడని, ప్రతిగా భారీగా కమీషన్లు నొక్కేశాడని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సకాలంలో స్పందించి ఆ డబ్బు వెనక్కి తీసుకున్నారని..లేకుంటే మొత్తం లూటీ చేసేవారని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో మండిపడ్డారు. ఇక మంత్రి పేర్ని నాని కూడా టీడీపీ హయాంలో బెజవాడ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసంలో యస్ బ్యాంకు ఛైర్మన్ రాణాకపూర్ ఒక రోజంతా ఉన్నారని..హవాలా ద్వారా యస్ బ్యాంకు ఛైర్మన్ రాణా కపూర్ వేల కోట్ల అక్రమ సొమ్మును విదేశాలకు తరలించారని ఆరోపించారు.
తాజాగా యస్ బ్యాంకు, చంద్రబాబుకు ఉన్న లింకులపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాణా కపూర్ ను ఈడి అరెస్టు చేసింది. యస్ అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయి. సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టింది కచ్చితంగా బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఒక పక్క ఐటీదాడులు, 2 వేల కోట్ల స్కామ్, హవాలా, మనీలాండరింగ్ స్కామ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు తగులుతున్న ఎదురు దెబ్బలు, టీడీపీ నేతల వరుస రాజీనామాలు, యస్ బ్యాంకు సంక్షోభం…ఇలా వరుసగా జరుగుతున్న ఘటనపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. తమ దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయేమిటని ఎల్లో మీడియా విలవిల్లాడుతోందంటూ జబర్దస్త్ పంచ్ ఇచ్చారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.