టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మార్చి 9 న ఒకేరోజు టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్‌లు పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ బద్ధశత్రువు, పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కు అయిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మార్చి 13న తన బద్ధ శత్రువైన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గత కొద్ది రోజులుగా సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తనపై వస్తున్న వార్తలను సతీష్ రెడ్డి ఖండించకపోవడంతో ఆయన రాజీనామా చేయడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు భావించారు. కాగా వైయస్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందులలో జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన దమ్ము టీడీపీలో ఒక్క సతీష్ రెడ్డికే ఉంది. వరుసగా జగన్ చేతిలో ఓడిపోతున్నా.. సతీష్ రెడ్డికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. పార్టీలకతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా అనుచరులు, అభిమానులు సతీష్ రెడ్డి వెంట నడుస్తారు. ముఖ్యంగా పులివెందులలోని కొన్ని మండలాలలో సతీష్ రెడ్డిని చూసే టీడీపీకి ఓట్లేసేవారు ఉన్నారు. అందుకే ఓ దశలో చంద్రబాబు, లోకేష్‌ల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సతీష్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుందామనుకున్నారు.. కాని తనను నమ్ముకున్న ప్రజల కోసం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కార్యకర్తలు అభిమానులతో సమావేశమైన సతీష్ రెడ్డి విస్తృతంగా చర్చించారు.
పులివెందులలో టీడీపీ పరిస్థితి బాలేదని, , ముఖ్యంగా పులివెందుల రౌడీలు, కడప గూండాలంటూ తమ ప్రాంత ప్రజలను కించపర్చద్దు అని చంద్రబాబు, లోకేష్‌లకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని, ఈ నేపథ్యంలో పార్టీని బాగుచేయలేమని సతీష్ రెడ్డి అనుచరులు కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులలో రాజకీయాల నుంచి తప్పుకోవడం కంటే..తనను నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల కోసం వైసీపీలో చేరడం బెటర్ అని సతీష్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. సతీష్ రెడ్డి నిర్ణయానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు మద్దతు పలికినట్లు సమాచారం. దీంతో ఈ నెల 13 న తనకు బద్ధ శత్రువైన సీఎం జగన్ సమక్షంలోనే వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు..ఈ మేరకు వైసీపీ అధిష్టానంతో సతీష్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తంగా సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడంతోపాటు వైసీపీలో చేరికకు డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం చంద్రబాబు, లోకేష్‌ల వల్లనే అని చెప్పక తప్పదు. ముఖ్యంగా పులివెందుల రౌడీలు అంటూ బాబు, లోకేష్, టీడీపీ నేతలు పదేపదే తమ ప్రాంతప్రజలను అవమానించడాన్ని తట్టుకోలేకే సతీష్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి…వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.