వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అంతే కాదు జేసీ ట్రావెల్స్ ఫోర్టరీ కేసులో పాటు, నకిలీ ఇన్సూరెన్స్ సర్ఠిఫికెట్ల బాగోతంలో పీకల్లోతు మునిగిపోయింది. ఇక జేసీకి చెందిన మైనింగ్ కంపెనీల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి మెడకు పాత కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. రెండేళ్ల క్రితం తాడిపత్రిలో ప్రఖ్యాత ప్రబోధానంద ఆశ్రమంపై 2018 సెప్టెంబర్‌లో జేసీ వర్గీయులు దాడి చేశారు. ఆ ఘటనలో సుమారు 1000 మందికి పైగా గాయపడగా…40 వాహనాలు సైతం దగ్ధమయ్యాయి. తమ ఆశ్రమానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు జేసీ అనుచరులు తమ ఆశ్రమంపై దాడి చేశారని స్వామి ప్రబోధానంద ఆరోపించారు. ప్రబోధానంద ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో జేసీపై కేసులు నమోదు చేశారు. కాని చంద్రబాబు హయాంలో ఆ కేసులపై విచారణ జరపకుండా జేసీ దివాకర్ రెడ్డి జాగ్రత్తపడ్డాడు. అయితే టీడీపీ ఓడిపోవడంతో మళ్లీ పోలీసులు పాత కేసులన్నీ తిరగదోడుతున్నారు.
తాజాగా రెండేళ్ల కింద ప్రభోదానంద ఆశ్రమంపై జరిగిన దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితులైన జేసీ బ్రదర్స్‌ను అరెస్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో స్వయంగా వెల్లడించారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం తాడిపత్రిలో జరిగిన ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై దాడి కేసును వైసీపీ ప్రభుత్వం తిరగదోడుతోందని జేసీ దివాకర్ రెడ్డి ఆక్షేపించారు. ఎదుటి పక్షం వారిపై కేసు పెట్టాల్సింది.. తమపై కేసులు పెడుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. బెయిల్‌పై విడుదల కాకుండా తమ వారిని జైల్లో పెడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో తాను దొరికితే తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందంటూ…తాను భయంతో వణికిపోతున్నానని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా జేసీ స్పందించారు. ఎవరెన్ని చెప్పినా రూపాయి ఇవ్వకపోయినా జగనే గెలుస్తారని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎన్నికల్లో ఇతర పార్టీల వారు గెలిచినా వారిని డబ్బు, మద్యం పంచారని చెప్పి జైల్లో వేస్తారని చెప్పారు. కొత్త చట్టాలు తెచ్చినందుకు జనం జగన్‌కు జేజేలు కొడుతున్నారని, అయితే ఆ చట్టం అందరికీ వర్తిస్తేనే మంచిదన్నారు. జగన్ దూకుడుకు నేను తాను భయపడ్డాను కాబట్టే స్థానిక ఎన్నికల్లో మా వర్గం వాళ్లను పోటీకి దింపట్లేదని జేసీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒక్కటైనా వైసీపీని ఓడించలేవు… స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది మావాడేనని జేసీ కుండబద్ధలు కొట్టారు. సీఎం జగన్‌ను తరచుగా మావాడు అనడం జేసీకి అలవాటు. మొత్తంగా తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయచ్చు..స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.