స్వచ్ఛ సిద్దిపేటే మన లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్య సిద్దిపేట సాధ్యపడుతుందని, దీనిపై ప్రజల్లో మరింత మార్పు తెచ్చేందుకు తానే స్వయంగా వార్డుల్లో శుభ్రత కోసం అడుగులు వేస్తాపని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
సోమవారం తెల్లవారు జామునే పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ చెత్త సేకరణ వాహనం వెంబడి తిరిగారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను ముందుండి నడిపిస్తూ ఇంటింటా తిరిగారు.
ప్రజలు తడి, పొడి చెత్త విభజన ప్రక్రియకు సహకరిస్తున్న వైనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా వార్డుల్లో కొందరు తడి, పొడి చెత్తను వేరు చేయడంలో వైఫల్యం చెందుతున్న తీరును గుర్తించిన మంత్రి ఓ దశలో పారిశుద్ధ్య కార్మికుడిగా అవతారమెత్తి తడి, పొడి చెత్తను వేరుచేసే విధానంపై అవగాహన కల్పించారు. కొన్ని చోట్ల చెత్తను బయట వేస్తున్న వారిని హెచ్చరించారు.