స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీలోకి టీడీపీ, జనసేన పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. మార్చి 9 వ తేదీ ఒకేరోజు టీడీపీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, విశాఖ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మరో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌తో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ మంత్రి బాలరాజు చేరికకు సీఎం జగన్ గ్రీన్ సిగల్న్ ఇవ్వడంతో ఆయన వేలాది మంది అనుచరులతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి బాలరాజు వైయస్ అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేశారు. బాలరాజు విధేయతను మెచ్చిన వైయస్ ఆయనకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. . అయితే వైయస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బాలరాజు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లలో కూడా మంత్రిగా పని చేశారు.
అయితే 2014 ఎన్నికల్లో పాడేరు నుంచి వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరీ చేతిలో బాలరాజు ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన నేపథ‌్యంలో కాంగ్రెస్ పార్టీ పని ఖతం కావడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన బాలరాజు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో తనకు పట్టు ఉన్న పాడేరు నుంచి మరోసారి పోటీ చేసినప్పటికీ బాలరాజు ఓడిపోయారు. గత కొంత కాలంగా పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలరాజు సరిగ్గా విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ రోజే జనసేనకు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత నుంచి వైసీపీ నేతలతో టచ్‌లోకి వచ్చిన బాలరాజు ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. తన తండ్రికి సన్నిహితుడైన బాలరాజును పార్టీలో చేర్చుకోవడానికి సీఎం జగన్ అంగీకరించడంతో ఆయన వెంటనే విజయసాయిరెడ్డి సమక్షంలో వేలాది మంది అనుచరులతో వైసీపీలో చేరారు. బాలరాజు చేరడంతో ఉత్తరాంధ్రలో గిరిజన ఓటుబ్యాంకు మరింత బలోపేతం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల వివాదంతో ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మాజీమంత్రి బాలరాజు లాంటి గిరిజన నేత వైసీపీలో చేరడంతో టీడీపీ, జనసేన పార్టీల ఓటుబ్యాంకుకు భారీగా గండిపడే అవకాశం ఉంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి వలసలు ఊపందుకుకోవడం చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు షాకింగ్‌గా మారింది.