ఏ ముహూర్తంలో చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి జై కొట్టాడో కాని…టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డొక్కా, రెహమాన్‌లు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా…మార్చి 13 న సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు, పాలకొండ్రాయుడు తదితరులు కూడా వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమైంది. తాజాగా మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా కీలకనేత, నందమూరి బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన కదిరి బాబురావు కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వైసీపీలో చేరే విషయమై తన అనుచరులతో చర్చించిన తర్వాత బాబురావు వైసీపీ కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది.
2009లో కనిగిరి నుంచి టీడీపీ టికెట్‌పై బాబురావు పోటీ చేసినా సాంకేతిక కారణాలతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇక 2014 ఎన్నికల్లో బాలయ్య సిఫార్స్‌తో కనిగిరి నుంచి పోటీ చేసిన బాబురావు విజయం సాధించాడు. అయితే 2019లో బాబురావు మళ్లీ కనిగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పినా వినకుండా చంద్రబాబు దర్శి టికెట్ ఇచ్చాడు. దర్శి నుంచి పోటీ చేయడం ఇష్టం లేకపోయినా బాలయ్య వత్తిడి మేరకు ఎన్నికల బరిలోకి దిగి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి బాబురావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం కాగానే పార్టీ మారుదామని బాబురావు భావించినా బాలయ్య టీడీపీలోనే ఉండమని కోరడంతో ఇన్నాళ్లు అయిష్టంగానే పార్టీలో కొనసాగారు. తనకు రాజకీయాల కంటే బాలయ్యతో సంబంధాల ముఖ్యమని కదిరి బాబురావు గతంలోనే తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి చేరడానికి ఇదే మంచి సమయమని బాబురావు భావించారు. వైసీపీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపిస్తే భవిష్యత్తు బాగుంటుందని బాబురావు అనుకుంటున్నారు. ఈ మేరకు వైసీపీలో చేరే విషయమై బాలయ్యతో మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. టీడీపీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని, అందుకే వైసీపీలో చేరుతున్నట్లు బాబురావు బాలయ్యకు ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య కూడా సరే..మీ ఇష్టం..అని ఒప్పుకున్నట్లు సమాచారం. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాబురావు మార్చి 10 మధ్యాహ్నం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా బాబురావుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాపు సామాజికవర్గానికి చెందిన కదిరి బాబురావు చేరికతో జిల్లాలో ప్రకాశం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ భావిస్తోంది. మొత్తంగా తనకు అత్యంత సన్నిహితుడైన బాలయ్యకు చెప్పి మరీ బాబురావు వైసీపీలో చేరడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. తన బావమరిది బాలయ్య దగ్గరుండి మరీ బాబురావును వైసీపీలోకి పంపించడం పట్ల చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు.