ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏ ఎన్నికలు అయినా మద్యం ఏరులై పారుతుంది. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభపెడుతుంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, ధన ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తుంటోంది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యాన్ని పంచిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు. అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేవిధంగా సీఎం జగన్ కొత్తగా నిఘా యాప్ ప్రారంభించారు. కాగా సీఎం జగన్ ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమన ఓడించడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. జగన్ ఏమైనా చీఫ్ ఎలక్షన్ ఆఫీసరా అంటూ చంద్రబాబు నోరుపారేసుకుంటున్నాడు.
సీఎం జగన్పై చంద్రబాబు చేసిన విమర్శలకు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు డబ్బు, మద్యం, ప్రలోభాలు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే, తమకే మేలు అని ఏ ప్రతిపక్షమైనా అనుకుంటుంది. అక్రమాలు లేకుండా స్థానిక ఎన్నికల కోసం సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం తమను ఓడించడానికేనంటూ వింత వాదన చేస్తున్నారని, ప్రజా బలం కోల్పోయిన వారి ప్రవర్తన ఇలానే ఉంటుందని సజ్జల మండిపడ్డారు. ఇక మరో ట్వీట్లో 2014 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాయని , అయినా వైఎస్సార్సీపీ బలంగా ఎదుర్కొందని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు, ఇంత బేలతనం చూపలేదని సజ్జల ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.